CID Notice to Chandrababu: అమరావతి భూముల అక్రమాల కేసులో మంగళవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. అమరావతి రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు.. ఉదయమే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు. విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక 41 సీఆర్పీసీ కింద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.
మరోవైపు చంద్రబాబుకు నోటీసులివ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధాని భూములపై ప్రభుత్వం రెండు కమిటీలు వేసిందన్నారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిర్ధారణకు వచ్చాకే సీఐడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఆరోపణలొచ్చినప్పుడు విచారణ జరిపితే తప్పేముందని బొత్స ప్రశ్నించారు. విచారణ జరిగితేనే వాస్తవాలు బయటికొస్తాయన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజధానిలో నష్టపోయినట్లు ఎవరైనా రైతులు బయటకు వచ్చారా? అని టీడీపీ నేత సోమిరెడ్డి ప్రశ్నించారు. భూములు తీసుకుని మోసం చేశఆరని ఏ దళితుడైనా వచ్చాడా? అని నిలదీశారు. భూములు తీసుకున్నారని ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా? అని ధ్వజమెత్తారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏమైనా రాజధానికి భూములిచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబును బోను ఎక్కించాలని చూస్తున్నారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేయడం వల్ల ఎవరు నష్టపోయారో చెప్పాలన్నారు సోమిరెడ్డి. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేయడం వల్ల దాదాపు 100 మందికిపైగా దళితులు ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఒక్క సంఘటన కూడా తమ హయాంలో అమరావతిలో జరుగలేదన్నారు. అయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమేంటని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి నిలదీశారు.
అమరావతిలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఏదోలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే తప్పుడు కేసులను ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. అవకతవకలంటూ కమిటీలు వేసినా నిగ్గుతేల్చలేకపోయారని అన్నారు. నియంతలు కాలగర్భంలో కలవక తప్పదని.. సీఎం జగన్‌ను ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. గతంలో టీడీపీ నాయకులు తమపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ వస్తే నల్ల బ్యాడ్జ్‌లు పెట్టుకుని ప్లకార్డులు చూపారని, అమిత్ షా వస్తే రాళ్ల దాడి చేశారని అది కక్ష సాధింపు అని సోము వీర్రాజు అన్నారు.
అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంతో టీడీపీ నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వ్యవహారంపై పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అయితే, సీఐడీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్.. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ద్వారా సీఐడీ ఈ కేసును ప్రారంభించిందన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడం ముమ్మాటికీ కుట్రే అని యనమల ఫైర్ అయ్యారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని హైకోర్టే స్పష్టం చేసిందన్నారు. తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ ఎవరి స్థలంలో నిర్మించారని యనమల ప్రశ్నించారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని యనమల తెలిపారు.
అమరావతి భూముల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. దళితులకు అన్యాయం చేసింది వైఎస్ఆర్ కుటుంబమే అని ధ్వజమెత్తారు. రెండేళ్ల తరువాత కళ్లు తెరిచి నోటీసులు ఇస్తారా? అంటూ వర్ల ఫైర్ అయ్యారు. అసైన్డ్ భూములను ఆధీనంలోకి తీసుకున్నదెవరో అందరికీ తెలుసునని అన్నారు. జగన్, విజయసాయి రెడ్డి బెయిల్స్ త్వరలోనే రద్దు కానున్నాయని అన్నారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయిస్తు్న్నారని వర్ల దుయ్యబట్టారు. సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో సీబీఐ ఉందన్నారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిని పట్టుకునే పనిలో సీబీఐ ఉందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని అన్నారు. ఇడుపులపాయలో దళితుల భూములను దోచుకున్నది మీరు కాదా? అంటూ వైఎస్ జగన్‌పై వర్ల రామయ్య ఫైర్ అయ్యారు.
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం కుట్రలో భాగమే అని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో కూడా రాజధాని భూముల పేరుతో అనేక కేసులు వేశారన్నారు. అక్రమాలు జరగలేదని కోర్టలే తేల్చాయని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇప్పుడు అసైన్డ్ భూముల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతిని నిరూపించలేకే.. ఇలాంటి కుయుక్తులకు తెర లేపుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై రవీంధ్ర ఫైర్ అయ్యారు.
అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో నియంత పాలన సాగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనమవుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు. జరుగుతున్న చర్యలన్నీ వైసీపీ మైండ్ గేమ్ లో భాగమేనని అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా జగన్ తీరు మారడం లేదని ఎమ్మెల్యే నిమ్మల విమర్శించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు స్వచ్ఛమైన రాజకీయాలు చేశారని, వైఎస్ఆర్ 26 కమిటీలు వేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని పేర్కొన్నారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయం జగన్ గుర్తించాలని ఎమ్మెల్యే నిమ్మల హితవుచెప్పారు.
గత ప్రభుత్వం తమ భూములు లాక్కుందని దళితులు తనకు ఫిర్యాదు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా వివరాలు సేకరించి సీఐడీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫిబ్రవరి 24న సీఐడీకి ఫిర్యాదు చేశానని ఆళ్ల పేర్కొన్నారు. ఈనెల 12న ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 500 ఎకరాలను కొట్టేశారని ఆయన ఆరోపించారు. తాడికొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలను దళితుల నుంచి లాక్కున్నారని ఆరోపించారు. రాజధాని ప్రకటన రాకముందే చంద్రబాబు తన బినామీల ద్వారా దళితుల నుంచి భూములు లాక్కున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దళితుల భూములే కాకుండా లంక భూములు, ప్రభుత్వ భూములను, దేవాదాయ భూములను సైతం దోచుకున్నారని ఆళ్ల మండిపడ్డారు. ఈ కేసు నుంచి చంద్రబాబు, నారాయణ తప్పించుకోలేరన్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి భూముల విక్రయాలు జరిపారని ఎమ్మెల్యే ఆరోపించారు.
రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోని భూములను చంద్రబాబు కొల్లగొట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలో భూములున్న దళితులను బాబు మోసం చేశారన్నారు. అసైన్డ్ భూముల పేరుతో వారిని బెదిరించి తీసుకున్నారని అన్నారు. దళితులకు చెందాల్సిన రూ. 500 కోట్ల రూపాయల్ని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారని అన్నారు.
అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. న్యాయ నిపుణులతో సంప్రదించారు. ఇందులో భాగంగానే ప్రముఖ న్యాయవాదులు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులుపై చంద్రబాబు న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు. ఈ నెల 23 న సీఐడీ విచారణకు హాజరు కావాల్సిన అంశంపై వారితో చర్చిస్తున్నారు. అలాగే సీఐడీ ఎఫ్ఐఆర్ తో పాటు 41ఏ కింద నోటీసులు ఇవ్వడంపైనా కోర్టుకి వెళ్లే అంశాలను న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. గతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చిస్తున్నారు. పాయింట్ ఆఫ్ జ్యురిడిక్షన్ కింద నోటీసు చెల్లుతుందా? లేదా? అన్న దానిపై చర్చిస్తున్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుకు సీడీఐ నోటీసులు ఇచ్చారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని కోసమే రైతుల ఆమోదంతో అసైన్డ్ భూములను తీసుకున్నామని అన్నారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారని ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా పెడతారని అచ్చెన్న ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎవరైనా మాజీ సీఎంపై ఎస్సీ, ఎస్టీ కేసులుు పెట్టారా? అని ప్రశ్నించారు. 2015లో ల్యాండ్ పూలింగ్ జరిగిందంటూ ఇప్పుడు నోటీసులు ఇస్తారా? అని నిలదీశారు. నేటికీ జగన్ సొంత ప్రయోజనాల కోసం అసైన్డ్ భూములను వాడుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసైన్డ్ భూముల్లో ఇల్లు కట్టుకున్న చరిత్ర జగన్‌ది అని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. రాజధాని భూముల వ్యవహారంపై 21 నెలలుగా ఏం చేశారని ప్రశ్నించారు. మున్సిపల్ ఫలితాలు రాగానే అధికార మదం తలకెక్కిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏం చేసినా చెల్లుతుందని జగన్ భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజధాని భూముల్లో అవకతవకలు జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబును కించపరిచేందుకే సీఐడీ నోటీసులు జారీ చేశారన్నారు. సీబీఐ దగ్గరకు జగన్ వెళ్లినట్లు చంద్రబాబును సీఐడీ దగ్గరకు వెళ్లేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం అన్నారు. తాము ఓడినంత మాత్రాన భయపడేది లేదన్నారు. వైసీపీ చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 2024లో తమ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఐడీ నోటీసుల నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు.
అమరావతి భూముల కుంభకోణం కేసులో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్పందించారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు పాడుతారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారని అంటూ ధ్వజమెత్తారు. సిల్లీ కేసులతో చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు అందజేసిన సీఐడీ.. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకూ సీడీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు తన నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఫిబ్రవరి 24న చంద్రబాబు, నారాయణపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. 120బి, 166, 167, 217 సెక్షన్ల చంద్రబాబుపై కేసు ఫైల్ చేశారు.
అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందజేసింది. ఈ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. టీడీపీ నేతల భూముల కొనుగోళ్లు మొదలు.. ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపులు, తదితర అంశాలపై పూర్తి వివరాలను నివేదికలో పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం తన అనునాయులకు భూములకు కేటాయించాకక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసినట్లు పేర్కొంది. దివంగత నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేని భూములు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. లింగమనేని భూముల కోసం సిఆర్డీయే హద్దుల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూములు ఉన్నాయని, ఆయన భూముల కోసం సీఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. 5 ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాల భూమి కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకో రేటు, ప్రైవేటు సంస్థలకోరేటుకు భూములు విక్రయించినట్లుగా గుర్తించారు. సింగపూర్‌తో ఒప్పందంలోనూ లోపాలు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.
అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు ఏ మొఖం పెట్టుకుని సమర్దించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు చుట్టూ ఉన్న నేతలే అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ పక్కా జరిగిందని, రికార్డ్స్ ఉన్నాయన్నారు. రాజధాని ప్రకటన కన్నా ముందే వేల ఎకరాలు కొనుగోళ్లు చేశారన్నారు. చంద్రబాబు చేసిన మోసం, దగా, అవినీతి విచారణ లో తేలుతుందన్నారు. నోటీసులు ఇస్తే విచారణ కి హాజరు కావాలని, మాకేం సంబంధం అంటే కుదరదని పేర్కొన్నారు. అమరావతి కుంభకోణంలో కూడా వైసీపీ కుట్ర ఉంది అంటే కుదరదన్నారు. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో అప్పటి మున్సిపల్ శాఖా మంత్రి నారాయణది కీలక పాత్ర అని మల్లాది విష్ణు ఆరోపించారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అని, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తమకు ఎవరిపైనా కక్ష లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం నాడు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. అయితే, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక టీవీ9 చేతికి అందింది. ఈ నివేదికలో భూముల కుంభకోణానికి సంబంధించి కీలక అధారాలు పేర్కొనడం జరిగింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది. క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొంది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందన్నారు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు.
అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు అయిన కేసుల వివరాలను ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు ఆరవ జూనియర్ సివిల్ జడ్జ్‌కు అందజేశారు. ఇక అంతకు ముందు.. ఈ భూముల వ్యవహారంలో నోటీసులు అందజేసేందుకు చంద్రబాబు ఇంటికి సీఐడీ డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉపసంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో లోకేష్ భూముల కొనుగోళ్లు చేసినట్లు పేర్కొంది. మొత్తం 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఇక లింగమనేని రమేష్.. తన భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను కూడా ఈ నివేదిక బయటపెట్టింది. నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూములు కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఇంకా భూముల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పేర్లు, రికార్డులు, ఆధారాలతో నివేదిక సమర్పించింది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పేర్లు ఇవే.
1. నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీ ఎం
2. వేమూరు రవికుమార్ ప్రసాద్, నారా లోకేష్ సన్నిహితుడు
3.పరిటాల సునీత, మాజీ మంత్రి
4. జీవి ఎస్ ఆంజనేయులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే
5.లింగమనేని రమేష్, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని
6. పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే
7. లంకా దినకర్,
8. దూళిపాళ్ల నరేంద్ర,
9. కంభంపాటి రామ్మోహన్ రావు,
10. పుట్టా మహేష్ యాదవ్
పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటు చేశారని ఆరోపించింది. టీడీపీ నేతలు.. తెల్ల రేషన్ కార్డు దారులను బినామీలుగా వాడినట్లు మంత్రివర్గఉపసంఘం తేల్చింది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేల్చింది. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేసినట్లు గుర్తించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. నివేదికలో పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది.
పలువురు టీడీపీ నేతలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే సీఆర్డీయే పరిధిని నాటి చంద్రబాబు ప్రభుత్వం మార్చినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. నేతల భూముల కోసం చంద్రబాబు ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. మంత్రివర్గ ఉపసంఘం ఇంకా ఏం చెప్పిందంటే.. సిఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పేశారు. బాలక్రిష్ణ వియ్యంకుడి సంస్థ విబిసి కెమికల్స్ కు భూముల కేటాయించారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించారు. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేశారు.
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం చంద్రబాము మెడకు చుట్టుకుంటోంది. నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు జరిపారని ఆరోపణలు వస్తున్నాయి. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కెబినెట్ ఆమోదం లేకుండా జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. అసైన్డ్ భూముల కొనుగోలు దారులకు లబ్ది కలిగేలా జీవో ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్ ఇచ్చి.. లబ్ది చేకూర్చేలా జీవో ఉందంటున్న ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. సీఐడీ నోటీసులు వేధింపు చర్యలు తప్ప మరేమీ కాదన్నారు. సీఐడీ అనేది సుప్రీంకోర్టు కాదని, ఒక సంస్థనే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఐడీ నోటీసులు ఇచ్చారని, విచారణకు హాజరవుతామని పేర్కొన్నారు. తాము చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందకకుండా వేధిస్తే తాము కూడా న్యాయపరంగా ముందుకు వెళ్తామని బోండా ఉమ స్పష్టం చేశారు. నిజమైన ఆధారాలుంటే 21 నెలలుగా ఏం చేశారని బోండా ఉమ ప్రశ్నించారు. కావాలనే రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. తాము తప్పు చేయలేదని, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము అక్రమాలు చేయలేదు కాబట్టే ఇన్నాళ్లు తమను ఏం చేయలేదన్నారు. సీఐడీ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సీఐడీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన అది నిజమైపోదని అన్నారు. సీఐడీ చెప్పిందే వేదం కాదని వ్యాఖ్యానించారు. న్యాయం తమ వైపే ఉందని, తమకు భయం లేదని స్పష్టం చేశారు.
రాజధానిపై మొదటి నుంచీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందిన టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులతో కమిటీ, మంత్రుల సబ్‌కమిటీ కూడా వేశారని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎక్కడా జరుగలేని హైకోర్టు స్పష్టం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.