Chandrababu On CM Jagan: టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, వినాయక చవితి వేడుకల నిర్వహణ తదితర అంశాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. అంతేకాదు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పాలనా విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా జగన్ రెడ్డి ప్రజలను భ్రమింపజేశారని.. ఇప్పుడు ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని అన్నారు. అంతేకాదు వైసీపీ నేతలు అసలు ఏపీలో దిశ చట్టం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు ఈనెల 9వ తేదీన నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించగా.. మరి ఏపీలో ఎందుకు అనుమతి నిరాకరించారని ప్రశ్నించారు చంద్రబాబు. అంతేకాదు ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వర్థంతికి వర్తించని కోవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయి.. అసలు వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని ముఖ్యమంత్రి జగన్రు తీరుని తప్పుపట్టారు. అంతేకాదు తన నేతలు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఇక ఏపీలో రోజు రోజుకీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని .. కమీషన్ల కోసం విద్యుత్ ను బయట నుంచి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. దశలవారీ మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. ప్రజలను మోసం చేశారని … ధరల పెంపుతో పాటు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మద్యంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రెండేళ్ల పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదు… రోడ్డు సెస్ రూ.1200 కోట్లు ఏమి చేశారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడలేక మద్దెలోడు అన్నట్లుగా అప్పులపై టీడీపీపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని.. జగన్ రెడ్డి అండ్ కో లూఠీ కోసమే అప్పులు చేశారు.. సంక్షేమం కోసం, కరోనా కోసం కాదన్నారు. కరోనా కష్ట కాలంలోనూ పన్నుల పెంపు ద్వారా రూ.75 వేల కోట్లు భారం ప్రజలపై మోపారు. రూ.2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఈ నిధులు లూటీ కాబట్టే అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతున్నారని చంద్రబాబు వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్, దియ్యా రామకృష్ణ తదితర నేతల అక్రమ అరెస్ట్ లపై ప్రైవేటు కేసులు పెట్టాలని సూచించారు. ఇదే విషయంపై తాము న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని చెప్పారు చంద్రబాబు.
Also Read: కోనసీమ పాఠశాలల్లో కరోనా పంజా.. పలువురు విద్యార్థులకు పాజిటివ్.. తల్లిదండ్రుల్లో టెన్షన్..