Gudivada Casino Politics: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కేసీనో(Casino) రగడ ఇంకా రగులుతూనే ఉంది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani)ని లక్ష్యంగా చేసుకుని విపక్ష నేతలు ప్రతి రోజూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju).. మంత్రి కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి నానికి సంక్రాంతి పండుగ అంటే తెలియాలని, సంక్రాంతి సంప్రదాయాలు అంటే ఏంటో చూపిద్దామనే గుడివాడకు వచ్చామని అన్నారు. మంచి కోసం వస్తే.. పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు సోము వీర్రాజు. గుడివాడలో నాని క్లబ్‌పై దాడి చేయడానికి తాము రాలేదన్నారు.
తమపైన అల్లరి మూకలు దాడి చేస్తాయని పోలీసులు చెబుతున్నారు.. మరి అల్లరి మూకలు క్యాసినో వాళ్లని ఎందుకు కొట్టలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. హిందుత్వంతో పెట్టుకోవద్దని, మత రాజకీయాలకు తెరలేపొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు వీర్రాజు. అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, అదే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే మూడు గంటల్లో అరెస్ట్ చేస్తారా? అని ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. కేసీనో నిర్వహించిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను సోము వీర్రాజు ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో సంక్రాంతి సంబరాలు అన్ని మండలాల్లో నిర్వహించాలని, 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. తమను అడ్డుకోవడం ధర్మవిరుద్ధం అన్నారు. తమను అరెస్ట్ చేసినా గుడివాడలో ప్రైజ్ డిస్డ్రిబ్యూషన్ చేశామని, మంత్రి కొడాలి నాని కి తమను ఆపే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మాధవ్ గుడివాడలో ప్రైజ్ డిస్డ్రిబ్యూషన్ చేశారని, పోలీసులు తమను వదిలితే గుడివాడ వెళతామన్నారు. పోలీసులు, మంత్రి నాని ఏం చేస్తారో చేయమనండి చూద్దాం అని సవాల్ విసిరారు సోము వీర్రాజు.
క్యాసినో వాళ్లకి టిక్కెట్లు ఎవరు తీశారని ప్రశ్నించిన వీర్రాజు.. గుడివాడ కేసినో వ్యవహారంపై ప్రజా ఉద్యమం చేపడతామని ప్రకటించారు.