AP Assembly: విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

|

Mar 21, 2022 | 11:18 AM

ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలు, పెగాసస్‌ అంశాలు కుదిపేశాయి. దీంతో అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో తెలుగు దేశం పార్టీ సభ్యులు ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.

AP Assembly: విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!
Ap Assembly Speaker
Follow us on

Andhra Pradesh Assembly Budget Session 2022: ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలు, పెగాసస్‌(Pegasus) అంశాలు కుదిపేశాయి. దీంతో అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో తెలుగు దేశం పార్టీ(TDP) సభ్యులు ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. పెగాసస్‌పై చర్చకు వైఎస్సార్‌సీపీ(YSRCP) డిమాండ్‌ చేసింది. జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో మరోసారి చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు. గందరగోళం మధ్యనే బెంగాల్‌ సీఎం వ్యాఖ్యలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రస్తావించారు. పెగాసస్‌పై చర్చకు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి నోటీస్‌ ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. దీనిపై చర్చ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పెగాసస్‌ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని అన్నారు. పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్‌ను వాడారని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారని మంత్రి అన్నారు. పెగాసస్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అవకాశముందన్నారు. పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్‌ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి అన్నారు.

అయితే, ఇవాళ కూడా జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.. అయిలే, మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. కానీ, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు. దీంతో టీడీపీ సభ్యులను సభాపతి శాసససభ నుంచి ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీ టీడీపీ సభ్యుల ఆందోళనపై నిర్మాణాత్మక మైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం హితవు పలికారు. సభలో సంస్కార వంతంగా, గౌరవ ప్రథంగా వ్యవహరించాలని సూచించారు. ‘ఇది శాసససభ.. వీధి మార్కెట్ కాదు… మీరు వీధి రౌడీలు కాదు’ అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సభ పట్ల, స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అపోహలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదిలావుంటే, ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతినిచ్చారు. ఇవాళ హిందూ ఛారిటబుల్‌ సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఫారిన్‌ లిక్కర్‌ సవరణ బిల్లును మంత్రి నారాయణ స్వామి ప్రవేశపెట్టనున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టూరిజం, మెడికల్‌ అండ్‌ హెల్త్‌.. విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్‌ డిమాండ్‌ గ్రాంట్స్‌పై ఓటింగ్‌ చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.