Prakasam Barrage: బిరబిరా కృష్ణమ్మ ప్రవాహం.. దీపాల కాంతిలో అద్భుత దృశ్యం.. పోటెత్తుతున్న ప్రజలు

|

Oct 20, 2024 | 8:29 PM

దీపాల కాంతిలో జల దృశ్యం.. జనం తన్మయత్వం. చుట్టూ చీకటి...లైట్ల వెలుగులో మెరిసిపోతున్న ప్రకాశం బ్యారేజ్‌. బిరబిరా గేట్లు దూకుతున్న కృష్ణమ్మ ప్రవాహం. వారెవ్వా ఏమి దృశ్యం...ఈ జల దృశ్యం అంటున్నారు బెజవాడ జనం. సెలవులు కావడంతో ఈ జల దృశ్యాన్ని చూడడానికి భారీ ఎత్తున బెజవాడ వాసులు బ్యారేజీని సందర్శిస్తున్నారు.

Prakasam Barrage: బిరబిరా కృష్ణమ్మ ప్రవాహం.. దీపాల కాంతిలో అద్భుత దృశ్యం.. పోటెత్తుతున్న ప్రజలు
Prakasam Barrage
Follow us on

గేట్లు తెరిచారు. లైట్లు వేశారు. నీటిని విడుదల చేశారు. గేట్లు దూకి సముద్రుడి దిశగా, కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. కృష్ణా నదిపై ఆఖరి ప్రాజెక్ట్‌ అయిన ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం పోటెత్తుతుండడంతో శనివారం సాయంత్రం నుంచి బ్యారేజ్‌కి ఉన్న 70 గేట్లను ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.

ప్రకాశం బ్యారేజ్‌కి ఉన్న 70 గేట్లలో 60 గేట్లను మూడు అడుగుల మేర, 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో లక్షా 78 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో లక్షా 38 వేల క్యూసెక్కులుగా ఉంది. సెలవులు కావడంతో ఈ జల దృశ్యాన్ని చూడడానికి భారీ ఎత్తున బెజవాడ వాసులు బ్యారేజీని సందర్శిస్తున్నారు. లైట్ల వెలుగులో కృష్ణమ్మ బిరబిరా పరవళ్లను చూసి పరవశించిపోతున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అటు శ్రీశైలం నుంచి, ఇటు నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్న క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..