మద్యం సేవించే అలవాటును తగ్గించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం రేట్లు విపరీతంగా పెంచేసింది. అంతేకాకుండా గతంలో ఉన్న బెల్ట్ షాపులకు చెక్ పెట్టింది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్స్‌లో మద్యం తాగాలంటే సామాన్యుడి వల్ల కాని పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా మద్యం సేవించే అలవాటులో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు ప్రభుత్వ పెద్దలే చెప్పారు. అయితే మందు బాబులకు కూడా వారికి తోచిన కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి ఆరుబయట ప్రదేశాల్లో సేవిస్తున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు, మైదానాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు మందుబాబులకు అడ్డగా మారాయి.
దీంతో వీటి సమీప ప్రాంతాల్లో ఉండే స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతూ వచ్చింది. ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించే వాళ్లతో నూసెన్స్ క్రియేట్ అవుతుందని ఫిర్యాదులు పోలీసులకు అందాయి. అంతేకాకుండా అర్ధరాత్రి వరకూ మద్యం సేవించి నగరాల్లో నేరాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే గుంటూరు రేంజ్ ఐజి పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆరు బయట మద్యం సేవించే వారిని ఉపేక్షించవద్దని గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఐజి పాలరాజు చెప్పారు. దీంతో ప్రతి రోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐలు కచ్చితంగా ఒక రౌండ్ వేసి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా పదే పదే అదే పనిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలో 11,440 కేసులు, పల్నాడులో 4,661 కేసులు, బాపట్ల జిల్లాలో 7780 కేసులు నమోదు చేయగా ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 13578, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12,166 కేసులు పెట్టారు. మొత్తంగా యాభై వేలకు పైగానే కేసులు పెట్టారు. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో నేరాలు సంఖ్య కూడా తగ్గుముఖం పట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడులు చేయడం, హత్యలు, దొంగతనాలతో పాటు ప్రమాదాల్లోనూ పదిశాతం తగ్గుముఖం పట్టినట్లు భావిస్తున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులు సిద్దం అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..