
బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం.. అయితే.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించేందుకు ఆపరేషన్ చేయాల్సిన వైద్యులు ఇష్టారీతిన సర్జరీ చేసేస్తున్నారు. ఏపీలోని మెజార్టీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు.. కాసులకు కక్కుర్తి పడి సిజేరియన్లకే మొగ్గు చూపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రక్తం తక్కువగా ఉన్నదని, ఉమ్మ నీటి ప్రాబ్లం ఉన్నదని .. ఇలా ఏదో ఒకటి చెప్పి గర్భిణీ బంధువులను భయపెట్టి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తూ.. రోగుల నుంచి లక్షల లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల కొన్ని ఆస్పత్రుల్లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో.. ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. ఏపీలోని ప్రైవేట్ హాస్పిటల్స్ సిజేరియన్ ఆపరేషన్ల వ్యవహారంపై సీరియస్ అయ్యింది వైద్యశాఖ. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్నారంటూ.. ఏపీవ్యాప్తంగా 104 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. సిజేరియన్లు ఎందుకు చేయాల్సి వస్తోందో అన్న అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది.
నార్మల్ డెలివరీ చేయకుండా డబ్బుల కోసం సిజేరియన్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు అడిషనల్ హెల్త్ డైరెక్టర్ అనిల్. అయితే.. నొప్పులు భరించలేక కొంతమంది, ముహూర్తాలు పెట్టుకుని మరికొంతమంది ఆపరేషన్స్ చేయించుకుంటున్నారని చెప్పారు. నార్మల్ డెలివరీల కోసం మిడ్ వైఫరీలను ఏర్పాటు చేశామని.. ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..