ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరోనా బారినపడి మరణించిన వారి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు వారి కుటుంబ సభ్యులకు అందించబడతాయని కృష్ణా జిల్లా డియంహెచ్ఓ డా.యం.సుహాసిని తెలిపారు. కరోనా మూలంగా మరణించినట్లు సంబంధిత డాక్టర్ ధృవీకరణ పిమ్మట వారి కుటుంబ సభ్యుల నామిని దారులకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేయబడుతుందన్నారు. దీనికిగాను వైద్యుడు ధ్రువీకరించిన మరణ ధ్రువీకరణ పత్రం, తహసీల్దార్ చే ధృవీకరించబడి మంజూరు చేయబడిన కుటుంబ సభ్యుల పత్రం తప్పనిసరి. ఈ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సచివాలయ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా సంబంధిత పిహెచ్‌సీ వైద్యాధికారికి అందజేయాలన్నారు. నగదు జమ చేసేందుకు నామిని బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ వివరాలను జతపరిచి అందజేయాల్సి వుందన్నారు. ఈ విధంగా సమర్పించిన పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి అర్హులైన వారి ఖాతాలోకి 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. కావున బాధిత కుటుంబ సభ్యులు పైన పేర్కొన్న వివరములను గమనించాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని తెలియజేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వం ఈ సాయాన్ని అందజేస్తుంది.
Also Read: విజయనగరం జిల్లాలో భారీ పెన్షన్ స్కామ్.. అందరూ కుమ్మక్కై ఇలా నొక్కేస్తున్నారు !