Andhra Pradesh: తల్లికి వందనం స్కీమ్‌పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

ఏపీలో తల్లికి వందనం పథకంపై వివాదం చెలరేగింది. కూటమి మోసం అంటూ వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టడంతో.. క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.....

Andhra Pradesh: తల్లికి వందనం స్కీమ్‌పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Andhra Government

Updated on: Jul 12, 2024 | 6:36 PM

గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి స్థానంలో.. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై పొలిటికల్‌ వివాదం రాజుకుంది. తల్లికి వందనం పథకం విధివిధానాలు ఇవే అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది వైసీపీ. జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని రాశారంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టీ మరీ భగ్గుమన్నారు. హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా మాట్లాతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఆర్థికసాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం… ఒక్క బిడ్డకే ఆర్థికసాయం ఇచ్చేలా జీవో విడుదల చేసిందన్నారు. తల్లికి వందనం పేరిట పిల్లలకు పంగనామాలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు.

‘తల్లికి వందనం’ పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం… పథకంపై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాతో పాటు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని ప్రకటించింది. ప్రభుత్వం విధివిధానాలు రూపొందించిన తర్వాత అధికారికంగా విడుదల చేస్తామని చెప్పింది. అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దనీ సూచించింది.

ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో.. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా… ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున నగదు అందిస్తామని కూటమి పార్టీలు హామి ఇచ్చాయి. ఇక ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలుకు మార్గదర్శకాలు ఇవేనంటూ.. కొన్ని మార్గనిర్దేశకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవన్నీ ఫేక్ అని.. మార్గదర్శకాలని త్వరలోనే విడుదల చేస్తామని కూటమి సర్కార్ ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.