గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రాష్ట్ర కార్యాలయాన్ని మే 21 ఆదివారం రోజున గ్రాండ్‌గా ప్రారంభించారు. అయితే ఆఫీసు ఓపెన్ చేసి 24 గంటలైనా గడవకముందే రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ బోర్డులను చింపి, పార్టీ జెండాలను తొలగించారు. దాడిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 11.35 గంటలకు గుంటూరులోని మంగళగిరి రోడ్డులోని ఏఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఐదంతస్తుల భవనంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ ఆచితూచి మాట్లాడారు. కేవలం కేసీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావించి.. ఆయనకు పీఎం అయ్యే యోగ్యత ఉందని చెప్పారే.. తప్ప ఏపీలోని ప్రధాన పార్టీలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయినప్పటికీ దుండగులు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి లభిస్తున్న స్పందనను జీర్ణించుకోలేక ప్రత్యర్థి పార్టీల సభ్యులు ఇలాంటి దాడికి పాల్పడి ఉంటారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఆంధ్రాలో వచ్చే ఎన్నికలకు సిద్దం అయ్యేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈవారం నుంచి పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలి వంటి ప్రణాళికలు ఇక్కడి నుంచే జరగనున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ నెక్ట్స్ మధ్యప్రదేశ్‌లో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో దూకుడుగా పార్టీ కార్యాలయం సిద్ధం చేసింది.
ఆఫీసును అట్టహాసంగా ప్రారంభించినా దానికి జనం నుంచి కానీ నేతల నుంచి కానీ పెద్దగా స్పందన రాలేదు. ఆఫీసు ఫుల్…..ఓపెనింగ్స్ డల్ అన్నట్టు ఉంది సిట్యువేషన్. అదరగొడుతుందనుకున్న కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదు. ఏపీలో విస్తరించి తర్వాత అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేశారు. అయితే గుంటూరులో జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవం ఇంత చప్పగా సాగడాన్ని బీఆర్‌ఎస్ ఎలా డిపెండ్ చేసుకుంటుంది అన్నది చూడాలి. కాగా పార్టీ కార్యలయ ఓపెనింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ పక్కనబెడితే.. కనీసం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..