Vizag: జై శ్రీరామ్.. రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం..

రోడ్డు పనుల్లో తవ్విన మట్టిలో నుంచి రాములోరి విగ్రహం బయటపడింది. విశాఖ మధురవాడలో కనిపించిన ఈ రాతి విగ్రహం పురాతనదని స్థానికులు భావిస్తుండగా… సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్కియాలజీ అధికారులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం.

Vizag: జై శ్రీరామ్.. రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం..
Lord Rama Idol

Edited By:

Updated on: Dec 20, 2025 | 4:08 PM

విశాఖలో రోడ్డు పనుల్లో రాములోరి విగ్రహం కనిపించింది. రోడ్డు చదును చేసిన తర్వాత ఆ మిగులు మట్టిని ఒకచోట పారబోశారు. దాంట్లో ఓ రాముడి విగ్రహాన్ని ఉండడం స్థానికులు గుర్తించారు. నడుము భాగం నుంచి తలవరకు ఉన్న ఈ రాతి విగ్రహం కనిపించిన విషయం ఆ నోట ఈ నోట పాకడంతో జనం.. చూసేందుకు తరలివచ్చారు.

మధురవాడ, వాంబే కాలనిలో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. హుడా కాలనీ నుంచి నగరంపాలెం వరకు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తున్నారు. దాదాపు 80 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డును చదును చేసిన తర్వాత.. మిగిలిన మట్టి రాళ్లను కలిపి ఓచోట వేశారు. అక్కడ ఓ వ్యక్తికి రాముడు విగ్రహం కనిపించింది. మట్టిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసి చూసేసరికి సగభాగమే ఉంది. విషయం కాస్త ఆ నోట ఈ నోట పాకడంతో.. రాముడు విగ్రహాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసారు.

ఇది పురాతన రాతి విగ్రహంగా స్థానికులు భావిస్తున్నారు. తమ ప్రాంతంలో బయటపడిన ఈ విగ్రహానికి ఒక ఆలయం నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. అయితే ఈ విగ్రహం బయటపడిన విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఇప్పుడు ఆర్కియాలజీ అధికారులు దృష్టి సారించారు. ఆ విగ్రహం ఏ కాలం నాటిది.. ఎక్కడ నుంచి వచ్చిందని దానిపై ఆరా తీసే పనిలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..