Face Mask Awareness: కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు, మాస్కులు బ్రహ్మస్త్రాలను నొక్కిచెబుతున్నారు. అయినా కొందరు వ్యక్తులు మాత్రం మాస్కులు పెట్టుకోవడం వంటి కొవిడ్ నివారణ నిబంధనలను ఏ మాత్రం లెక్కచేయకుండా బహిరంగ ప్రదేశాల్లో తెగ తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కమిషనర్, పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. “ONE PICTURE SPEAKS THOUSAND WORDS” అన్న సూక్తి మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గుంతకల్లు పట్టణంలోని అన్ని క్లాత్ షోరూం, రెడీమేడ్ దుకాణాల వద్ద ఉండే అందమైన బొమ్మలకు మాస్కులు ధరింపజేసేలా చర్యలు చేపట్టారు. ప్రాణం లేని బొమ్మలే మాస్కు ధరించాయి..మీరు ఇకనైనా మాస్కు ధరించరా? అని ప్రశ్నించే విధంగా ఈ బొమ్మలను ఏర్పాటు చేశారు.
ప్రజల్లో మాస్కులపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలా బొమ్మలకు సైతం మాస్కులు ధరింపజేసినట్లు గుంతకల్ మున్సిపల్ కమిషనర్ బండి శేశయ్య తెలిపారు. మాస్క్ ధరించడంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎంత చెప్పినా మాస్కు ధరించకుండా తిరిగే జనానికి అర్ధమయ్యే విధంగా బొమ్మలకు మాస్కులు ధరింపజేసినట్లు చెప్పారు. ప్రజల్లో మార్పు వస్తుందో లేదో తెలియదు కానీ దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ మాస్కులు ధరించిన అందమైన బొమ్మలు మాత్రం ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అధికారులు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చి ఇంకా మాస్కు ధరించని వారిలో మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం.
(లక్ష్మీకాంత్, టీవీ9 తెలుగు, అనంతపురం జిల్లా)
Also Read..