
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని దేవళంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో తీవ్ర దుమారం రేగింది. ఎస్సీ సంఘాలతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఇక ఇష్యూని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు పాత విగ్రహం ప్లేస్‌లో 13 అడుగుల కొత్త విగ్రహాన్ని పెట్టింది. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులకూ ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి.
ఇక ఘనపై ఇటు టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందన్నారు ఎమ్మెల్యేలు థామస్, మురళి. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దేవళంపేట అంబేద్కర్ విగ్రహం కాల్చివేత ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషన్ చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించింది.
నివేదికలో ఎఫ్.ఐ.ఆర్ వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ వివరాలు ఇవ్వాలన్న కమీషన్.. నిర్దిష్ట గడువులో నివేదిక అందించపోతే సంబంధిత అధికారులు కమిషన్ ముందు హాజరు అయ్యేలా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. షెడ్యూల్డ్ కులాల భద్రత, గౌరవం కాపాడటంలో కమిషన్ కట్టుబడి ఉందన్న ఎంపీ గురుమూర్తి..ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.