Amaravati: నవ రాజధానిలో చరిత్రాత్మక ఆరంభం.. అమరావతిలో పెట్టబోయే తొలి విగ్రహం ఎవరిదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చరిత్రాత్మకత ఆరంభం కాబోతోంది. ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని మొట్టమొదటగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25న వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. రాజకీయాలకు అతీతంగా అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నిలపడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Amaravati: నవ రాజధానిలో చరిత్రాత్మక ఆరంభం.. అమరావతిలో పెట్టబోయే తొలి విగ్రహం ఎవరిదో తెలుసా?
Amaravati First Statue Unveiling

Edited By:

Updated on: Dec 23, 2025 | 4:50 PM

NDAలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర నూతన రాజధానిలో బీజేపీ దిగ్గజ దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది. అభివృద్ధి, సమన్వయం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు ప్రతిరూపంగా వాజ్‌పేయిని భావిస్తూ.. అదే దిశలో అమరావతిని ముందుకు నడిపించాలన్న సందేశం ఇందులో ప్రతిఫలిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వెంకటపాలెంలో ఏర్పాట్ల చేయబోయే వాజ్‌పేయి విగ్రహా ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో అమరావతిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం వాజ్‌పేయిదే కావడం గర్వకారణమని చెప్పారు. అందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగించేలా వాజ్‌పేయి విగ్రహం ఉండబోతుందని మాధవ్ పేర్కొన్నారు.

14 అడుగుల ఎత్తులో కాంస్యంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాధవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఇతర కార్యక్రమాల కారణంగా హాజరుకావడం లేదని చెప్పారు. అయితే ఢిల్లీ నుంచి పలువురు కేంద్ర నాయకులు ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్లు మాధవ్ వెల్లడించారు. అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు కేవలం ఒక విగ్రహ ఆవిష్కరణ మాత్రమే కాదని, భవిష్యత్ రాజధానికి ఒక ఆలోచనాత్మక ఆరంభమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.