తనను రెచ్చగొడితే.. ఎంతదాకైనా పోరాడుతానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడున్న ప్రభుత్వానికి టీడీపీ భయపడుతుందేమో కానీ.. జనసేన భయపడదని అన్నారు. ప్రభుత్వంపై వంద రోజుల తరువాత విమర్శలు చేద్దామనుకున్నా గానీ..రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఎన్నికల్లో డబ్బులు పంచడం వైసీపీకే సాధ్యమైందని.. అందుకే వారు అధికారంలో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను లాక్కోవడానికి వారు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తమ ఎమ్మెల్యేపై 5 నుంచి 7కేసులు పెట్టారని.. మరి జర్నలిస్ట్‌పై చేయి చేసుకున్న నెల్లూరు ఎమ్మెల్యేపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంతవరకు పురోగతి లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో నెల్సన్ మండేలానే తనకు ఆదర్శమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. చిరంజీవిని ఏడ్పించినట్లే తనను కొంతమంది నేతలు ఏడ్పించారని.. తాను మాత్రం మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ పేర్కొన్నారు.