కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన ఆరు రోజులుగా కొనసాగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ముందు జూడాలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీసీపీ హర్షవర్ధన్ ఓ జూనియర్ డాక్టర్ పై చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసుల తీరుపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి, డీసీపీ చేత తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని.. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో డీసీపీ హర్షవర్ధన్ పై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మరోవైపు తిరుపతిలోని అలిపిరి వద్ద జూనియర్ డాక్టర్ల ధర్నా కొనసాగుతోంది. దీంతో తిరుమలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఆరు రోజులుగా డాక్టర్లు విధులకు దూరంగా ఉండటంతో.. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జూడాల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా విధుల్లో చేరాలని ఆదేశించారు.