ఆంధ్రప్రదేశ్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడిసిన్ కోర్సుల్లో 2019-20 సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం ఈనెల 5వ తేదీన(ఆదివారం) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు జాతీయ విద్యామండలి(ఎన్‌టీఏ) అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది సుమారు లక్షకు పైగా పరీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. ఎప్పటిలాగే ఈసారి కూడా నీట్ నిర్వహణలో కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోని ఏ వస్తువులు తీసుకురాకూడదు? ఎలాంటి దుస్తులు ధరించాలి? తదితర అంశాలపైనా జాతీయ విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. షుగర్ ఉన్నవారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించరు. పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ నిర్వహిస్తారు. వచ్చే నెల 5న నీట్ ఫలితాలు వెల్లడవుతాయి.