ఏపీలో ఇసుక కొరత సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై విపక్షాలు వైఎస్ జగన్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. టీడీపీతో పాటు జనసేన కూడా ఇసుక కొరత విషయంలో అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఇసుక కొరత అంశంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది కృష్ణా, గోదావరి, పెన్నాకు వరదలు వచ్చాయని.. వరదల వలనే ఇబ్బందులు వచ్చాయని ఆయన అన్నారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో 10 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని… 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక సంవత్సరానికి అవసరం ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 వేల మందికి 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇక వరదల తగ్గిన తరువాత.. పారదర్శకంగా అందరికి ఇసుకను అందిస్తామని స్పష్టం చేశారు. దీనిపై కొందరు కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కూడా ఇసుక కొరతపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత త్వరలోనే తీరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాల నుంచే మనకు ఇసుక వస్తోందని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.
ఇదిలా ఉంటే ఇసుక కొరతపై మరోసారి నిరసనకు టీడీపీ సిద్ధమైంది. ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా చెప్పారు. ఆ రోజు అన్ని రెవెన్యూ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక కొరతతో ఇబ్బంది పడుతున్న వర్గాలు ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.