పోలవరం హైడల్ ప్రాజెక్టు పనుల అగ్రిమెంటును ఏపీ జెన్ కో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ఈ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏపీ జెన్ కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ముందుకు వెళ్లరాదని తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నకోర్టు-హైడల్ ప్రాజెక్టు రద్దు అంశంలో ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ఈ పనులను ఇతరులకు అప్పగించకుండా నిలువరించాలని, తమనే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని నవయుగ ఇంజనీరింగ్ సంస్థ తమ పిటిషన్ లో కోరిన సంగతి తెలిసిందే. ఏపీ జెన్ కో తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి కాంట్రాక్ట్ విషయంలో తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఈ ప్రాజెక్టుకు జెన్ కో సకాలంలో స్థలం చూపనందునే జాప్యం జరిగిందని ఈ సంస్థ వివరించింది. ఎలాంటి కారణం చూపకుండా ప్రభుత్వం కాంట్రాక్టును ఎలా రద్దు చేస్తుందని నవయుగ తరఫు లాయర్ ప్రశ్నించారు. 2021 నవంబరు వరకు తమకు గడువు ఉందన్నారు. కాగా-హైడల్ ప్రాజెక్టు విషయంలో మాత్రమే కోర్టు తీర్పునివ్వడంతో పోలవరం హెడ్ వర్క్స్ పనులకు అంతరాయం ఉండదని భావిస్తున్నారు. హెడ్ వర్క్స్ అంశంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ జారీ చేసి.. ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2015-16 ఎస్ ఎస్ ఎస్ ఆర్ ధరల ప్రకారం మొత్తం రూ. 4,900 కోట్ల మేర టెండర్లను ఆహ్వానించింది. హెడ్ వర్క్స్ కు రూ. 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు రూ. 3,100 కోట్ల పనులకు రివర్స్ టెండర్లను ఆహ్వానించింది.