Beach : హంసలదీవి దగ్గర వంద అడుగుల ముందుకు సముద్రం, కృష్ణమ్మ పాదాలు ప్లాట్‌ఫాం ధ్వంసం

|

Jul 14, 2021 | 8:50 AM

కృష్ణా జిల్లా హంసలదీవి దగ్గర బీచ్‌లలో అలల ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. సముద్రం వంద అడుగులు ముందుకు రావడంతో దివిసీమ

Beach : హంసలదీవి దగ్గర వంద అడుగుల ముందుకు సముద్రం, కృష్ణమ్మ పాదాలు ప్లాట్‌ఫాం ధ్వంసం
Beach
Follow us on

Hamsaladeevi: కృష్ణా జిల్లా హంసలదీవి దగ్గర బీచ్‌లలో అలల ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. సముద్రం వంద అడుగులు ముందుకు రావడంతో దివిసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బీచ్‌ రహదారి పెద్దఎత్తున కోతకు గురైంది. బీచ్‌ దగ్గర నుంచి సాగరసంగమం వరకూ సుమారు మూడు కిలోమీటర్ల మేర మూడు అడుగుల ఎత్తు ఉన్న ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. కృష్ణమ్మ పాదాలు విగ్రహం కోసం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌ ధ్వంసమైంది.

సముద్రంలో రేగుతున్న అలజడుల కారణంగా హంసలదీవి ప్రాంతంలో సముద్రం ముందుకి తోసుకొచ్చి భీకరంగా కనిపిస్తుంది. సముద్రపు నీరు ఇసుక మేటలను దాటుకుని మరీ వస్తుంది. నీరు ముందుకి దూసుకురావడంతో సముద్ర తీరం కాస్తా చెరువులా దర్శనమిస్తుంది. గతంలో ఎప్పుడూ చూడని రకంగా సముద్రం కనపడుతుందని, తూఫానులు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు సముద్రపు కోత ఎక్కువవుతుందని దీనిపై అధ్యయనం చెయ్యాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు.

హంసలదీవి ప్రాంతంలోనే కాకుండా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో సముద్రపు పోటుకు అవనిగడ్డ ఎదురుమొండి నుండి బ్రహ్మం గారి మూల ప్రాంతంలో కూడా తీరం కోతకు గురవుతుంది. ఈ సమస్యని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అధికారులతో మాట్లాడి సమస్య పరిస్కార దిశగా చర్యలు చేపట్టారు.

ఇలా ఉండగా, సముద్రపు కోతల నుండి తీర ప్రాంతాలను, సమీప పల్లెలను కాపాడటంలో మడ అడవులు పాత్ర కీలకంగా ఉంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 250 చ.కి.మీ. విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి. ఇవి తీరప్రాంతానికి, సముద్రానికి మధ్య ఒక అడ్డుకట్టలా ఉంటూ తీరప్రాంతాన్ని కోత నుంచి కాపాడతున్నాయి. ముఖ్యంగా హంసలదీవి వంటి ప్రాంతాలకు మడ అడవులు సముద్రం నుంచి ఎదురయ్యే పెనుగాలులు, తుపానులు, ఆటుపోట్లు, సునామీ వంటి ప్రమాదాల నుంచి కాపాడుతూ ఒక సహజ రక్షణ కవచంలా ఉంటున్నాయి. నానాటికి తరిగిపోతున్న జీవవైవిధ్యాన్ని ఇవి సంరక్షిస్తున్నాయి.

అంతేకాదు, ఎంతో వైవిధ్యభరితమైన జీవరాశులకు ఇవి ఆటపట్టుగా ఉన్నాయి. వలసపక్షులు గూళ్ళు కట్టుకునేందుకు, సముద్రజీవుల సంతానోత్పత్తికి ఈ అడవులు అనువుగా ఉంటాయి. నీటిలోని మాలిన్యాలను, హాని కలిగించే భారలోహాలను శోషించుకుని నీటిని శుద్ధి చేస్తాయి. అలాగే గాలిలోని కాలుష్యాలను శోషించుకుని గాలిని కూడా శుద్ధి చేస్తున్నాయి. తీర ప్రాంత వాసులకు మడ అడవుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని..  వీటి సంరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read also: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక : తిరుమల తిరుపతి దేవస్థానం