తన ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, ఎస్పీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ల వినియోగంపై అభ్యంతరమని.. ఎస్పీ అనుమతి లేకుండా తన నివాస పరిసరాల్లో డ్రోన్లను ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. డ్రోన్లకు అనుమతి ఎవరిచ్చారు? డ్రోన్ కెమెరా వాడింది ఎవరు? నా భద్రతను ప్రశ్నార్థకం చేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కాగా కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంపై రహస్య డ్రోన్లు తిరుగుతుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరిగేషన్ శాఖ అనుమతితోనే వరద ఉధృతి తెలుసుకునేందుకు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నామంటూ మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.