పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. దళితుల్ని దూషించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటు మరికొందరు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేని పై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక కొరతపై ధర్నాకు బయల్దేరిన చింతమనేనిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావాలనే ఆయనపై కేసులు పెడుతున్నారని.. ధర్నాకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆందోళనకు దిగారు.
ఇదిలా వుంటే తనపై కేసు నమోదు కావడం పై చింతమనేని స్పందించారు. టీడీపీ ధర్నాలతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. తనపై కక్షపూరితంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని.. ఇసుక కార్మికులకు న్యాయం జరిపించి తీరుతామని ఆయన తెలిపారు.