
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరిగిన పరీక్షపేపర్ లీకయ్యిందనే వార్తలపై ఏపీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. తమకు ప్రశ్నాపత్రం లీకేజీకి ఎటువంటి సంబంధం లేదని ఏపీపీఎస్పీ వివరణ ఇచ్చింది. ఈ పరీక్షలను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ప్రభుత్వమే నిర్వహించిందని, ఏపీపీఎస్సీ నుంచి సహాయం మాత్రం అందించినట్టుగా ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీపై తీవ్రస్ధాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సంస్ధ కార్యదర్శి మౌర్యతో కలిసి ఆయన సమీక్ష జరిపారు. సుధీర్ఘంగా సాగిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వమే విచారణ జరిపించాలన్నారు. పరీక్షల నిర్వహణలో తమ పాత్ర ఏమీ లేదని, కేవలం సాయం మాత్రం చేశామన్నారు. పూర్తిగా పంచాయతీ రాజ్ శాఖ ఈపరీక్షలు నిర్వహించిందని తెలిపారు ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్.