కృష్ణా జిల్లాలోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై రహస్య డ్రోన్లను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ స్పందించారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తామే విజువల్స్ రికార్డ్ చేయించామని ఆయన అన్నారు. గత మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నాం.. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లు వాడుతున్నామని ఆయన వెల్లడించారు. కరకట్ట ప్రాంతాల ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత అని.. దీనిపై చంద్రాబాబు, టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఈ ఉదయం చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్లి.. డ్రోన్లతో ఆపరేటింగ్ చేస్తుండగా గమనించిన టీడీపీ కార్యకర్తలు వారిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడుపై దాడి చేసేందుకే రహస్యంగా ఇంటి భద్రత, సెక్యురిటీ ఉండే ప్రదేశాలు చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. డ్రోన్లను ఆపరేటింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి, శిక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.