ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టీ ఫలితాలపైనే. ఈ నెల 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఏపీ కింగ్ ఎవరు..? కింగ్ మేకరెవరు..? రేసులో గెలిచేది సైకిలా? ఫ్యానా? అమరావతిలో లోకేష్ మెజార్టీ ఎంత..? ఇలాంటి అంశాలపై కోట్లలో పందేలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ గెలుస్తాడంటూ.. 300 కోట్ల రూపాయల మేర బెట్టింగులు చేశారంటే.. బెట్టింగ్‌లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్‌పై టీవీ9 టీమ్ నిఘా పెట్టి.. బెట్టింగ్ బాగోతాన్ని బయటి ప్రపంచానికి చూపించింది.
పొలిటికల్ బెట్టింగ్‌లో మధ్యవర్తులే కీలకంగా మారారు. బెట్టింగ్ కాసేవారు.. మధ్యవర్తులకు 5 శాతం కమిషన్ కూడా ఇవ్వాలి. అదే విధంగా బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నారు. కొందరైతే డబ్బులకు బదులు పొలాలు రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా వెనకాడటం లేదని టీవీ9 నిఘాలో తేలింది. టీవీ9, పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఏడుగురు బెట్టింగ్ రాయుళ్లు పట్టుబడ్డారు. రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, రెండు బైకులు సీజ్ చేశారు. అయితే.. పొలిటికల్ బెట్టింగ్ ముఠా పట్టుబడడం ఇదే మొట్టమొదటి సారి అని పోలీసులు చెప్తున్నారు.