
ఏపీ కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు రాజధానులపై కీలక చర్చ జరగనుంది. ముఖ్యంగా జీఎన్ రావు కమిటీ నివేదికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న 33వేల ఎకరాలపైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాల సేకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటుపై చర్చించనున్నారు. పంటలకు మద్దతు ధర, ఏపీఐసీసీ ద్వారా వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశముంది. వీటితో పాటు సీఆర్డీయేలో ఐఏఎస్‌లు కొన్న ప్లాట్లకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపైనా చర్చించనున్నారు.అయితే మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి అమరావతిలో రైతులతో పాటు మిగిలిన వర్గాల వారు ఆందోళనను చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మూడు రాజధానుల ప్రతిపాదనపై విజయవాడ, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతంలో సెక్షన్ 144ను అమలు చేశారు.