Mekapati Goutham Reddy – IT Jobs : రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 55 వేల ఐ.టీ ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఐటీ రంగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖలో ఐకానిక్ టవర్ల ఏర్పాటుపై మంత్రి ఇవాళ అమరావతిలో సమీక్ష నిర్వహించి అధికార్లకు దిశానిర్దేశం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్ ప్రమోషన్లను మరింత పెంచాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు ఉన్నాయన్నారు. సీఈవోల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు.
అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్ని ఉద్యోగాలివ్వగలమన్నది నైపుణ్య, శిక్షణ ఎంత మందికి ఇచ్చామన్నదానిపై ఆధారపడి ఉంటుందన్న మంత్రి.. అందుకు తగిన సహకారం, ఏర్పాట్ల గురించి మరింత దృష్టి పెట్టాలన్నారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు.. సీవోఈల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి అధికార్లను కోరారు.
భవిష్యత్ లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. ఐ.టీ, మానుఫాక్చరింగ్ కంపెనీలతో శాఖపరమైన చర్చలు, ఫాలోఅప్ దశల గురించి మంత్రి చర్చించారు. ఏయే మానుఫాక్చరింగ్ కంపెనీలతో సంప్రదింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మంత్రికి వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీ సీఈవో నందకిశోర్ వివరించారు.