CM Jagan: ఇంతకుముందెన్నడూ లేని విధంగా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్‌

|

Sep 17, 2021 | 9:16 PM

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు సీఎం జగన్‌. హోం, గిరిజన సంక్షేమం, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు

CM Jagan: ఇంతకుముందెన్నడూ లేని విధంగా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్‌
Cm Jagan
Follow us on

AP Traibals: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు సీఎం జగన్‌. హోం, గిరిజన సంక్షేమం, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో సీఎం సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం జరగబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ జరిపారు.

రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను సమావేశంలో డీజీపీ వివరించారు. మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ చెప్పారు. సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందన్నారు డీజీపీ. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయని సీఎం చెప్పారు.

గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చామన్నారు సీఎం జగన్‌. ప్రతి ఏటా 13,500 గిరిజన రైతుల చేతిలో పెడుతున్నామన్నారు. ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగుకోసం కార్యాచరణ కూడా రూపొందించామన్నారు. ఆసరా, చేయూత, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్‌ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్‌ ఇచ్చామని.. ఈ కార్యక్రమాలన్నీ గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయని జగన్ వెల్లడించారు.

అలాగే షెడ్యూలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేస్తున్న నాడు–నేడు కార్యక్రమాలకూ తగిన సహకారాలు అందించాలంటూ కేంద్రాన్ని కోరాల్సిందిగా అధికారులకు సూచించారు సీఎం. ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్, మొబైల్‌ సౌకర్యం కల్పించే దిశగా అడుగేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

Read also: Char Dham Yatra: స్టే ఎత్తివేత, మరికొన్ని గంటల్లో చార్ ధామ్ యాత్ర.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ