Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. అడిగిన ప్రశ్నలు ఇవేనట

| Edited By: Ram Naramaneni

Oct 11, 2023 | 9:16 PM

ఈ కేసులో 14 వ నిందితుడిగా ఉన్న లోకేష్‌ను హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేశారు అధికారులు. మొదటి రోజు హెరిటేజ్ భూముల కొనుగోలుపై లోకేష్‌ను ప్రశ్నలు అడిగారు. రెండో రోజు అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో 2017లో అమరావతి అంశంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. అడిగిన ప్రశ్నలు ఇవేనట
Nara Lokesh
Follow us on

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ విచారణ ముగిసింది. రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు లోకేష్. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రోజు నారా లోకేష్‌ను 30 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు రెండో రోజు విచారణలో 47 ప్రశ్నలు అడిగారు. మొత్తం హెరిటేజ్ సంస్థకు సంబంధించి, లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు చేయడం ద్వారా భారీగా లబ్ది పొందేలా కుట్ర పన్నినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 వ నిందితుడిగా ఉన్న లోకేష్‌ను హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేశారు అధికారులు. మొదటి రోజు హెరిటేజ్ భూముల కొనుగోలుపై లోకేష్‌ను ప్రశ్నలు అడిగారు. రెండో రోజు అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో 2017లో అమరావతి అంశంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కోసం ఈ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారా అనే వివరాలు అడిగారు. ఇక లోకేష్ మంత్రి అయిన వెంటనే కేబినెట్ సబ్ కమిటీలో ఎందుకు చేర్చారని కూడా అడిగారు. కేబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు.. అలైన్మెంట్ మార్పు కోసం మంత్రివర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను మీరు ఒత్తిడి చేశారా అని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారని ప్రశ్నించిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఖాతా నుంచి లింగమనేని రమేష్‌కు 27 లక్షలు ఎందుకు చెల్లించారని.. దానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయలేదని ప్రశ్నించారు. లింగమనేని ఇల్లు క్విడ్ ప్రోకోలో ఇచ్చారు కదా.. అని అడిగినట్లు తెలిసింది. మొదటి రోజు ఆరున్నర గంటలపాటు నారా లోకేష్‌ను విచారించిన సీఐడీ అధికారులు రెండో రోజు ఆరు గంటలపాటు విచారించారు. ప్రస్తుతానికి విచారణ ముగిసినట్లు అధికారులు చెప్పారని… మళ్లీ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. సీఐడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడినుంచి ఢిల్లీ వెళ్లారు లోకేష్.

సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు, నారాయణ, నారా లోకేష్ తో పాటు కొత్తపు పునీత్ పైనా కేసు నమోదు చేసింది సీఐడీ. మాజీ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు కొత్తపు పునీత్…ఈ కేసులో పునీత్ విచారణ కోసం సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులపై పునీత్ హైకోర్టు కు వెళ్లడంతో న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో తన లాయర్‌ను తీసుకుని పునీత్ ఉదయం 10 గంటలకు సీఐడీ ఆఫీస్ కు వచ్చారు. లోకేష్‌ను, పునీత్‌ను ఒకే కేసులో వేరువేరుగా విచారణ చేసింది సీఐడీ. IRR అలైన్మెంట్ మార్పులో భూముల ధరలు పెంచేలా చేయడం, నష్ట పరిహారం విషయంలో నారాయణతో పాటు పునీత్ కూడా ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్నారనేది సీఐడీ అభియోగం. దీంతో పునీత్ నుంచి సమాచారం సేకరించారు సీఐడీ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకూ పునీత్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.రేపు కూడా విచారణకు హాజరుకావాలని పునీత్ కు సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..