Konaseema Violence: కోనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన హింసలో రోజురోజుకు అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 44మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. తాజాగా మరో 25మందిని అరెస్టు చేశారు. ఇవాళ మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అమలాపురం అల్లర్లపై డీఐజీ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో బలగాల మోహరింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సిబ్బందితో సమీక్షించిన డీఐజీ.. కోనసీమలో మరో 24గంటలపాటు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో వారంపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అమలాపురంలో చెలరేగిన హింసతో జరిగిన ఆస్తి నష్టాన్ని నిందితుల ఆస్తులను జప్తుచేసైనా రాబడతామన్నారు.
టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించినట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా విధ్వంసానికి కుట్రచేసినట్లు తేల్చారు డీఐజీ. అరెస్టుల సంగతి ఏమోగాని.. పోలీసుల ఆంక్షలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4రోజులుగా ఇంటర్నెట్ లేక ఉద్యోగులు సిగ్నళ్ల కోసం జిల్లా సరిహద్దుల్లో పడిగాపులుగాస్తూ పనులు కాక సతమతమవుతున్నారు. పోలీసులు చెబుతున్నట్లు మరో వారంలోపైనా.. సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయా అన్నది అనుమానమే అని స్థానికులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..