Vizag: అడవిలో ఆగిన ఆర్టీసీ బస్సు.. ఘాట్ రోడ్‌లో ఆరు గంటలు అవస్థలు..

అల్లూరి ఏజెన్సీలోని ధారాలమ్మ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో సుమారు 40 మంది ప్రయాణికులు ఆరు గంటల పాటు బస్సులోనే చిక్కుకుపోయారు. మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆహారం, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

Vizag: అడవిలో ఆగిన ఆర్టీసీ బస్సు.. ఘాట్ రోడ్‌లో ఆరు గంటలు అవస్థలు..
Bus Breakdown

Edited By:

Updated on: Jul 19, 2026 | 5:47 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని ధారాలమ్మ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో సుమారు 40 మంది ప్రయాణికులు దాదాపు ఆరు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బస్సులోనే చిక్కుకుపోయి ఆహారం, తాగునీరు లేక అవస్థలు పడ్డారు.

భద్రాచలం నుంచి విశాఖపట్నం బయలుదేరిన ఆర్టీసీ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో భద్రాచలంలో జరిగిన స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని తిరుగు ప్రయాణం అవుతున్న నవోదయ విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. తెల్లవారుజామున భద్రాచలం నుంచి బయలుదేరిన ఈ బస్సు సాయంత్రానికి విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది.

అయితే ధారాలమ్మ ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఇంజిన్ ఒక్కసారిగా పనిచేయకుండా పోవడంతో వాహనం మధ్య రోడ్డులోనే నిలిచిపోయింది. డ్రైవర్ బస్సును మరమ్మతు చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్సును రోడ్డుకు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

బస్సు మరమ్మతులు వెంటనే పూర్తికాకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు మరింత పెరిగాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, ఆ మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు పరిమితంగా ఉండటంతో ప్రత్యామ్నాయ రవాణా కూడా అందుబాటులోకి రాలేదు. ఉదయం 11 గంటల ప్రాంతంలో నిలిచిపోయిన బస్సు సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండిపోయింది. ఈ ఆరు గంటల పాటు ప్రయాణికులు తాగడానికి నీరు, తినడానికి ఆహారం లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. చిన్నారులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బస్సు డ్రైవర్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ప్రత్యామ్నాయ బస్సు పంపాలని కోరారు. అధికారులు సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఘటనాస్థలికి మళ్లించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ బస్సు అక్కడికి చేరుకుని బ్రేక్‌డౌన్ అయిన బస్సులోని ప్రయాణికులను నర్సీపట్నానికి తరలించింది.

నర్సీపట్నం నుంచి విశాఖపట్నానికి వెళ్లేందుకు మరో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దట్టమైన ఏజెన్సీ ప్రాంతంలో గంటల తరబడి బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇలాంటి కీలక మార్గాల్లో ప్రత్యామ్నాయ బస్సులను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us