AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇలాంటి మరణం ఎవరికీ రావొద్దు.. రేబిస్‌తో రెండేళ్ల బాలుడు మృతి..

కుక్క కాటును నిర్లక్ష్యం చేయడంతో పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి రుద్రాన్స్‌ రేబిస్‌ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుక్క కరిచిన వెంటనే వైద్యులను సంప్రదించి, సకాలంలో రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Andhra: ఇలాంటి మరణం ఎవరికీ రావొద్దు.. రేబిస్‌తో రెండేళ్ల బాలుడు మృతి..
Boy Dies
Ram Naramaneni
|

Updated on: Sep 24, 2026 | 9:12 PM

Share

కుక్క కాటును చిన్న విషయంగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో పల్నాడు జిల్లాలో జరిగిన విషాద ఘటన మరోసారి గుర్తు చేసింది. కుక్క కరిచిన తర్వాత సకాలంలో రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోకపోవడంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రేబిస్‌ లక్షణాలు బయటపడిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చిన్నారిని కాపాడలేకపోయారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి రుద్రాన్స్‌ను సుమారు 15 రోజుల క్రితం కుక్క కరిచినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే కుక్క కాటు తీవ్రతపై సరైన అవగాహన లేకపోవడంతో వెంటనే వైద్య చికిత్స తీసుకోలేదని సమాచారం. దీంతో చిన్నారికి రేబిస్‌ సోకే ప్రమాదం ఏర్పడింది.

కొన్ని రోజుల తర్వాత చిన్నారిలో అనారోగ్య లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని భారతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాల వైద్య నిపుణుడు డాక్టర్‌ నాగేశ్వరరావు చిన్నారిని పరీక్షించారు. రేబిస్‌ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులకు వివరించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే గుంటూరులోని ఐడీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఐడీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే చిన్నారి పరిస్థితి మరింత విషమించి, గంటల వ్యవధిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై డాక్టర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కుక్క లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. వెంటనే కాటు వేసిన ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి, సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. అవసరాన్ని బట్టి వైద్యులు సూచించే ఇతర రక్షణ చికిత్సలు కూడా సకాలంలో పొందాలని చెప్పారు.

రేబిస్‌ వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత చికిత్స చేయడం అత్యంత క్లిష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కుక్క కాటు జరిగిన వెంటనే తీసుకునే జాగ్రత్తలు అత్యంత కీలకమని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేబిస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒక కుక్క కాటు.. చిన్న నిర్లక్ష్యం.. ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. రేబిస్‌పై అవగాహన కలిగి ఉండటంతో పాటు, కుక్క కాటు జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా ఇలాంటి విషాదాలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కుక్క కాటును ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Follow Us