విజయనగరం జిల్లాలో అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్)ను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు పదిహేను రాష్ట్రాల నుండి డ్వాక్రా మహిళలు తాము తయారుచేసిన ఉత్పత్తులతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ డ్వాక్రా బజార్లో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామీణ చిరు వ్యాపారులకు మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సరస్ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో జరిగే ఈ సరస్ ఈ ఏడాది విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా వ్యాపారులు తమ ఉత్పత్తులను ఈ బజారులో ప్రదర్శించి విక్రయాలు జరుపుతారు.
ఈ ఏడాది విజయనగరంలో ఏర్పాటు చేసిన సరస్‌కు విశేష స్పందన లభించింది. ఇక్కడకు మొత్తం 242 మంది మహిళ చిరు వ్యాపారులు వచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ నెల పదవ తేదీన సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. పదవ తేదీ నుండి 20వ తేదీ వరకు పది రోజులు పాటు జరగనున్న డ్వాక్రా బజార్‌ను సందర్శించేందుకు నిత్యం వేలాదిమంది సందర్శకులు తరలివస్తున్నారు. డ్వాక్రా మహిళలు తాము స్వయంగా తయారు చేసిన తినుబండారాల నుండి ఫ్యాన్సీ ఐటమ్స్, చీరలు, పలు సంప్రదాయ దుస్తులతోపాటు మొత్తం 240కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.