ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ ఘరానా మోసం బయట పడింది. నెలకు వెయ్యి చప్పున మూడు సంవత్సరాలు 36 వేలు కడితే మూడేళ్ళ తర్వాత 9 వేలు వడ్డీ వస్తుందంటూ.. ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. డబ్బు కట్టించుకుని ఆదర్శ కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ పాస్ బుక్స్ ఇచ్చింది. డబ్బు కట్టించుకుని మూడేళ్లయినా సరే తిరిగి ఇవ్వక పోవడంతో నిలదీశారు బాధితులు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ ఆదర్శ్ సొసైటీ.. చెప్పడంతో.. అందరూ తిరగబడ్డారు. దీంతో కట్టించుకున్న వాళ్లు కనిపించకుండా పరారై పోయారు. దీంతో మోసపోయామంటూ.. గన్నవరం పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
ఈ సంస్థ ద్వారా మోసపోయిన వారు 20 మంది వరకూ పోలీస్టేషన్ కి వచ్చారు. 2017 నుంచి ఇప్పటి వరకూ 25 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. గతంలో బాధితులు డబ్బు కట్టించుకున్న కోపరేటివ్ బ్యాంకు దగ్గరకు వెళ్లగా.. అసలు అలాంటి బ్యాంకే లేదనడంతో.. తీవ్ర ఆందోళన చెందారు బాధితులు. ఆస్పత్రుల ఖర్చులకూ పిల్లల చదువులకు పెళ్లిళ్లకు.. దాచుకున్న సొమ్ము పట్టుకుని పారిపోవడంతో.. లబోదిబోమంటున్నారు బాధితులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..