ఆ ఇంట ఎంతో ముద్దైన కవల పిల్లలు పుట్టారు. దీంతో కుటుంబ సభ్యుల మోముల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ముఖ్యంగా ఎంతో ఆనందించిన తల్లికి.. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఓ జామకాయ ముక్క ఆ ఇంట ఊహించని విషాదాన్ని నింపింది. ఆడుకుంటూ జామకాయ ముక్కను మింగడంతో.. అది గొంతులో అడ్డుపడి ఊపిరాడక ఓ పసికందు చనిపోయింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు శివారు గ్రామం లంకతోటలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నలగడ్డ స్వామి, అనిల్‌బాబు దంపతులకు కవల ఆడపిల్లలు జన్మించారు. లంకతోటలోని అమ్మమ్మ ఇంట పిల్లలు ఉండగా.. వారిలో పెద్దపాప వీక్షిత(9 నెలలు) గురువారం ఆడుకుంటూ నేలపై ఉన్న జామకాయ ముక్కను నోట్లో పెట్టుకుని మింగే ప్రయత్నం చేసింది. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకపోవడం తీవ్ర ఇబ్బంది పడింది. దీంతో వెంటనే పాపను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారి గొంతులోని జామ ముక్కను కక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ చిన్నారి పుట్టిన 9 నెలలకే అసువులు బాసింది.
ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో తల్లి లావణ్యతో పాటు ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృత్యువాత పడ్డారు. చిన్న కుమారుడు హర్షవర్ధన్(6) ప్రాణాలతో బయటపడ్డాడు. బావి నుంచి బయటపడిన చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Also Read: నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో