
ఏపీలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ అందించింది. ప్రయాణికులకు సౌకర్యానికి అనుకూలంగా రైల్వేశాఖ రైళ్లను కొన్ని ప్రాంతాల వరకు పొడిగిస్తుండగా.. అలాగే రైల్వేస్టేషన్లను కొత్తగా అభివృద్ది చేస్తున్నారు. ఇటీవల విజయవాడ-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నర్సాపురం వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీని వల్ల పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలకు మరింత లాభం జరగనుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఆ రైలును పొడిగించారు. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు రైళ్లకు కొత్తగా మరో రైల్వేస్టేషన్‌లో హాల్ట్ సౌకర్యం కల్పించారు.
విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్(18521/18522), విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్(17219/17220) రైళ్లకు కొత్తగా కొవ్వూరులో హాల్ట్ కల్పించారు. ఈ మేరకు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కొవ్వూరులో విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గతంలో కరోనా కాలంలో కొవ్వూరులో ఆగే పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో కారణంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో తమ సమస్యను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. దీంతో కేంద్రమంత్రి ఆదేశాలతో రైల్వేశాఖ ఈ రెండు రైళ్లకు కొవ్వురులో హాల్ట్ కల్పించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ఈ రైళ్లు బాగా ఉపయోగపడనున్నాయి. అలాగే వ్యాపారులు, విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. త్వరలో కొవ్వూరులో మరికొన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు రానున్న గోదావరి పుష్కరాలను పురష్కరించుకుని కొవ్వూరు రైల్వేస్టేషన్‌ను రూ.17 కోట్లతో అభివృద్ది చేయనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం నాలుగు రైళ్లకు కొవ్వురులో హాల్ట్ కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో మరికొన్ని రైళ్లు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రంలో కొవ్వురు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.