
ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 29: దోమల బెడద నుంచి రక్షణ పొందడానికి చాలా మంది రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఎక్కువ మంది దోమల నుంచి రక్షణకు రాత్రిపూట మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. దీనివలన రకరకాల ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ కుటుంబం రాత్రి నిద్రకు ముందు గదిలో మస్కిటో కయిల్ పెట్టి నిద్రపోయింది. అది అనుకోకుండా నిద్రలో దుప్పటికి అంటుకుని ఆ ఇంటి దీపాన్ని ఆర్పివేసింది. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నాడు. అయితే స్థానికంగా దోమల బెడద ఎక్కువగా ఉండటంతో మస్కిటో కాయిల్ అంటించి అందరు నిద్రపోయారు. అయితే నిద్రలో అనిల్ తొమ్మిదేళ్ల కొడుకు దుప్పటి మస్కిటో కాయిల్‌పై పడింది. దీంతో దుప్పటికి నిప్పు అంటుకోవడంతో గదిలొ మంటలు చెలరేగాయి. నిద్ర మత్తులో ఉన్న అనిల్‌కు కళ్లు తెరచి చూసే సరికి జరగాల్సిన అనార్ధం జరిగిపోయింది. మంటల్లో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటీన బాలుడిని సమీసంలోని అస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దీంతో కుటంబం మొత్తం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇళ్లల్లో మస్కిటో కాయిల్ నిర్లక్ష్యంగా వినియోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు కాయిల్ వెలిగించి తలుపులు, కిటికీలు మూసి నిద్రపోతుంటారు. దీనివల్ల కాయిల్ నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు గదిలో చుట్టుకుపోయి అదే గాలి పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా దాపురిస్తుంది. అందుకే నిద్రకు ముందు కాయిల్ ఆర్పివేయడం లేదంటే బెడ్‌కు దూరంగా ఉంచుకోవడం మంచిది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.