ఏడేళ్ల వయస్సులోనే గుండె నిబ్బరం.. తన వారందరూ అపస్మారక స్థితిలో ఉండగా సమయ స్పూర్తితో వ్యవహరించిన బాలుడు. బళ్లారిలో ఒక ఫంక్షన్ హాజరై తిరిగి గుంటూరుకు కారులో బయలు దేరారు. నగరంలో నివాసముండే గంగాధర శర్మ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వినుకొండ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గంగాధర శర్మతో పాటు ఆయన భార్య యశోద, డ్రైవర్ నిర్మలకుమార్ అక్కడికక్కడే చనిపోయారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న గంగాధర శర్మ కొడుకు హెచ్ఎస్ వై శర్మ ఆయన భార్య నాగసంధ్య వారి కుమార్తెకు గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే వీరితో పాటే కారులో ప్రయాణిస్తున్న శర్మ కుమారుడు కార్తీక్కి స్వల్ప గాయాలు అయ్యాయి. కార్తీక్ వయస్సు ఏడేళ్లు. ప్రమాదం జరిగినప్పుడు తెల్లవారుజామున నాలుగైంది. వేగంగా వస్తున్న కారు వినుకొండ దాటిన తర్వాత డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. చుట్టు పక్కల అంతా చీకటిగా ఉంది. ఆ సమయంలో కార్తీక్ గుండె నిబ్బరం కోల్పోలేదు. సమయస్పూర్తితో వ్యవహరించి వాళ్ల నాన్న ఫోన్ తీసుకొని వెంటనే వాళ్ల అత్తకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తమ కారు ప్రమాదానికి గురైనట్లు చెప్పాడు. వెంటనే తేరుకున్న కార్తీక్ అత్త పోలీసులకు సమాచారం అందించి. వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్ వచ్చేలా చేశారు. సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న హెచ్ ఎస్ వై శర్మ ఆయన భార్య, కుమార్తెను వెంటనే నర్సరావుపేటలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. గాయాల నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ఇంత పెద్ద ప్రమాదంలోనూ భయపడకుండా ఫోన్ చేసి బంధువులకు సమాచారం ఇచ్చి తన వారిని కాపాడుకున్న కార్తీక్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..