
ఆరు సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ డ్రిల్ బిట్ మింగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు ప్రభుత్వ వైద్యులు. తుమ్మల గౌతమ్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా వెంటనే స్పందించిన సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ సర్జరీ చేసి డ్రిల్ బిట్‌ను బయటికి తీసి బాలుడి ప్రాణాన్ని కాపాడారు. పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం ఆటలాడుతూ డ్రిల్ బిట్ మింగి తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చిన్న బాలుడు కావడంతో.. అనుమానపడ్డ వైద్యులు.. గౌతమ్‌కు ఎక్స్‌రే తీశారు. పెద్ద పేగులో డ్రిల్ బిట్ అడ్డంగా ఇరుక్కుపోయి ఉన్నట్టు అందులో గుర్తించారు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న బాలుడిని గమనించిన సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ వెంటనే మూడు గంటలపాటు శ్రమించి సర్జరీ చేసి ఆరు సెంటీమీటర్ల డ్రిల్ బిట్‌ను బయటికి తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సర్జరీ అనంతరం బాలుడిని ఐసియూలో మెరుగైన వైద్యం అందిస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు వైద్యులు.