కారులో దర్జాగా వచ్చాడు.. మద్యం దుకాణం ఎదురుగా కారు అపాడు. కారు దిగకుండానే అక్కడే ఉన్న ఓ వ్యక్తికి 500 రూపాయల నోట్లు ఇచ్చి ఒక క్వార్టర్ నువ్వు కొనుక్కో, నాకు ఒక క్వార్టర్ తెచ్చివ్వంటూ మద్యం దుకాణానికి పంపించాడు. యధాలాపంగా 500 రూపాయల నోటును తీసుకుని పరీక్షించాడు మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తి. అది దొంగనోటుగా అనుమానం వచ్చింది. వెంటనే నోటును ఇచ్చిన వ్యక్తిని నిలదీశాడు. ఆ నోటును కారులో ఉన్న వ్యక్తి ఇచ్చాడని అతడు చెప్పగానే కారు దగ్గరకు వచ్చాడు మద్యం దుకాణంలో పనిచేసే యువకుడు. ఇది దొంగనోటు అని తెలియదా… ఇలాంటివి ఇంకా ఉన్నాయా అంటూ కారులో వ్యక్తిని ప్రశ్నించాడు. తన బండారం బయటపడిందని తెలుసుకున్న కారులోని వ్యక్తి అత్యంత వేగంగా కారును ముందుకు దూకించి పారిపోయాడు. వెంటనే మద్యం దుకాణంలోని యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు…
సమాచారం అందుకున్న పోలీసులు మద్యం దుకాణం దగ్గరకు వచ్చి దొంగనోటును స్వాధీనం చేసుకుని కారులోని వ్యక్తికోసం విచారణ చేపట్టారు. అయితే అప్పటికే కారులో వచ్చిన ఆ వ్యక్తి మద్యం షాపు పక్కనే రెండు బడ్డీ కొట్టుల్లో 500 రూపాయల నోట్లు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దీంతో తమకు దొంగనోట్లు అంటగట్టి సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్ళిన కారు యజమాని తమను మోసం చేశాడని ఆ చిరువ్యాపారులు గుర్తించి లబోదిబోమంటున్నారు. తాము మోసపోయిందే కాకుండా పోలీసుల విచారణ ఎదుర్కొవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశంజిల్లా హననుమంతునిపాడు మండలం వేములపాడులో దొంగ నోట్ల కలకలం రేగింది. నకిలీ 500 రూపాయల నోట్ల చలామణి చేస్తున్న వ్యక్తి చిక్కినట్టు చిక్కి తప్పించుకున్నాడు. వేములపాడులోని బ్రాందీ షాపులో ఒక నోటు, మరొక చిన్న బడ్డీ కొట్టులో మరొక 500 రూపాయల నోటు మారుస్తుండగా గమనించిన షాపు యజమాని నిలదీయడంతో కారు ఎక్కి హై స్పీడ్ తో కంభం వైపు పారిపోయాడు. బ్రాందీ షాపు దగ్గరికి వేరే వ్యక్తిని పంపించి దొంగ నోటు మార్చడానికి ప్రయత్నించిగా బ్రాందీషాపులోని సేల్స్ బాయ్ ప్రసాద్ కి ఇది దొంగ నోటు గా అనుమానించి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వ్యక్తి పారిపోవడంతో అతడ్ని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దొంగనోట్ల మార్పిడిపై పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టారు. వేములపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో ఎవరైనా 500 రూపాయలు ఇచ్చి వస్తువులు కొనుగోలు చేశారా అంటూ ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..