Srikalahasti: బస్టాండ్ వద్ద తేడాగా ఆ ముగ్గురి వాలకం.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా
మీరు ఎన్ని చర్యలు అయినా తీసుకోండి.. మేం తగ్గం అంటున్నారు స్మగ్లర్లు. ఏకంగా బస్సుల్లోనే మత్తు రవాణాకు పూనుకుంటున్నారు. తాజాగా అక్రమంగా గంజాయి రవాణాకు యత్నించిన ముగ్గురు నిందితులను శ్రీకాళహస్తిలో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి .. ..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు తగ్గేదే లే అంటున్నారు. మత్తు రవాణాలో రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. కేసులో పెట్టి లోపల వేస్తున్నా బెయిల్‌పై బయటకు వచ్చి అదే దందాకు పూనుకుంటున్నారు. తాజాగా శ్రీకాళహస్తి ఎంజిఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులకు గంజాయి అక్రమ రవాణా గురించి ముందుగానే ఉప్పు అందింది. దీంతో పక్కాగా మాటు వేసి మే 26న సాయంత్రం 6 గంటల సమయంలో గంజాయి రవాణాకు యత్నించిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడులోని అంబత్తూరు ప్రాంతానికి గంజాయి తరలించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. శ్రీకాళహస్తి ఎంజిఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద, చెన్నై వెళ్ళే బస్ కోసం ఎదురు చూస్తుండగా నిందితులను పట్టుకున్నారు. నిందితులు ఎం. మురళి, జె. శ్యామ్ రాజ్, ఎం. సంజయ్ కుమార్ తమిళనాడుకు చెందినవారిగా తెలిపారు.
నిందితుల నుంచి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విచారణలో, అరెస్టు చేసిన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితుల పట్టుకునే దిశగా ఉన్నతాధికారులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డిని, ఎస్ఐ శ్రీ పార్ధసారధిని, అలాగే సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రమణ్యం, నందకుమార్, ప్రవీణ్, సుధాకర్, రేగాన్‌లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.

Accused With Police
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
