Kadiyam Nursery:ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఎక్కడ చూసినా కొత్త సంవత్సర సందడి నెలకొంది. కడియం పల్ల వెంకన్న, శ్రీ సత్యదేవా నర్సరీల్లో వేలాది మొక్కలతో అందమైన ఆకృతులను తీర్చిదిద్దారు. జై కిసాన్, జై జవాన్, దేశానికి రైతే రాజు అంటూ పలు సందేశాలతో మొక్కలను కొలువుతీర్చారు. సత్యదేవా నర్సరీ లో భారతదేశ ముఖ చిత్రం వేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెల్పుతూ ఒక ఆకృతి హలం పట్టిన రైతును మొక్కలతో చిత్రీకరిస్తు మరో ఆకృతిని ప్రదర్షించారు. వ్యవసాయ రంగం పై ఆంక్షలు విధిస్తూ కేంద్రప్రభుత్వం చేసిన చట్టాలను ఉపసంహరించుకోవడం శుభపరిణామం అని కడియం నర్సరీ మేన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు అన్నారు.
పల్ల వెంకన్న నర్సరీ లో కూడా రెండు విభిన్న ఆకృతులను మొక్కలతో అలంకరించారు. ఆల్ట్రానేత్రా గ్రీన్, ఎల్లో, పింక్, మెండో గ్రాస్, అర్చిపోలియో బ్లాక్, కొలియాస్ రకాలు, సాల్వియా వంటి వేలాదిజాతి మొక్కలతో సృజనాత్మకమైన ఆకృతులను తీర్చిదిద్దారు. హలం ఓ వైపు, తుపాకీ ఓ వైపు నింపి జై జవాన్, జై కిసాన్ అక్షర వర్ణవైవిద్యాన్ని కాన్వాస్ పై ఉంచారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడియం నర్సరీ లో నెలకొన్న ఈ ఆకృతులు నర్సరీ రైతుల్లో ని దేశభక్తిని, సామాజిక హితాన్ని చాటింది. కనుల పండుగగా కనిపిస్తున్న ఈ మొక్కల చిత్రాల వద్ద ఫోటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు.
Also Read: నూతన సంవత్సరలోని పండుగలు, ముఖ్యమైన రోజులు పూర్తి వివరాలు మీ కోసం..