సూర్యారావుపాలెం, అక్టోబర్ 31: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు మీద పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అనంతరం ఆ మంటలు సమీపంలో బాణాసంచా తయారు చేస్తున్న ప్రదేశానికి వ్యాపించాయి. ఈ ఘటనలో బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న పదిమందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మరో ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం పట్ల పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పండగ సమయంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తణుకు ఏరియా హాస్పిటల్ లో వైద్యం పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు అవసరమైన సహాయ చర్యలు అందించాలని తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.