అది ఊర్లోని పురాతన శివాలయం.. ఆలయంలోని చాలా చోట్ల పాడుబడింది. ఆలయ కమిటీ మరమ్మత్తు పనులకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పనులు జరుగుతున్న వేళ.. ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ధ్వజస్తంబాల కింద పనివారికి ధగ.. ధగ.. మెరుస్తూ కనిపించాయి. ఇంతకీ అవేంటని చూసేందుకు వెళ్లగా.. వాళ్లకు దిమ్మతిరిగిపోయింది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి.!
వివరాల్లోకెళ్తే.. నెల్లూరు జిల్లాలోని గుడ్లూరులో ఉన్న స్థానిక పురాతన శివాలయంలో మరమ్మత్తు పనులు జరిగాయి. సోమవారం జరిగిన జీర్ణోద్ధారణ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ పార్వతీదేవి, వినాయకస్వామి ధ్వజస్తంభాలు తొలగించారు. ఈ క్రమంలోనే ధ్వజస్తంభం తీస్తుండగా.. కూలీలకు 405 పురాతన నాణేలు.. అలాగే వినాయకుడి ప్రతిమ కింద 105 నాణేలు లభించాయి. ఈ విషయం స్థానికంగా తెలియడంతో.. నాణేలు దొరికిన కొన్ని క్షణాల్లోనే వార్త వైరల్‌గా మారింది.
ధ్వజస్తంభం కింద లభించిన నాణేలు 1800 -1850 మధ్యకాలం నాటివిగా గుర్తించారు. అయితే వినాయక విగ్రహం కింద దొరికిన నాణేలపై ఎలాంటి ముద్రలు లేవని తెలుస్తోంది. ఆయా నాణేలను భద్రపరిచిన ఆలయ నిర్వాహకులు.. మళ్లీ ప్రతిష్ట సమయంలో వినియోగిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ పురాతన నాణేలను ఆలయం నిర్మించే సమయంలో పాతిపెట్టి ఉంచి ఉంటారని స్థానికలు భావిస్తున్నారు. గతంలోనే పురాతన ఆలయాల జీర్ణోద్దరణ కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లో ఇలాంటి నాణేలు బయటపడిన సందర్బాలు లేకపోలేదని అంటున్నారు.