
పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడు గ్రామంలో అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. స్థానిక పురాతన శివాలయం సమీపంలోని పొదల్లో సగం పూడ్చబడిన 16వ శతాబ్దానికి చెందిన వీరభద్రుడి అందమైన చిన్న శిల్పం లభ్యమైందని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ పురావస్తు శాస్త్రవేత్త, సీఈవో డాక్టర్ ఈ శివనాగిరెడ్డి తెలిపారు.
స్థానిక నివాసి మున్నంగి జగన్నాధం ఇచ్చిన సమాచారం ఆధారంగా శివనాగిరెడ్డి మంగళవారం 6 అంగుళాల పొడవు, 12 అంగుళాల ఎత్తు, 2 అంగుళాల మందం కలిగిన ఆ విగ్రహాన్ని పరిశీలించారు. వీరభద్రుడు కుడి చేతితో బాణం, కత్తి.. ఎడమ చేతిలో విల్లు, డాలు పట్టుకుని ఉన్నట్లు ఈ విగ్రహాన్ని చెక్కారు. వీరభద్రుడు త్రిభంగలో పీఠంపై నిలబడి ఉండటం విలక్షణమైన విజయనగర ఐకానోగ్రఫీ, కళా శైలిని సూచిస్తుందని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న శిల్పాన్ని జాగ్రత్త చేసి.. స్థానిక పాత శివాలయంలో దానిని భద్రపరిచినందుకు మున్నంగి జగన్నాధంను అభినందించారు. దానిని భావితరాల కోసం సంరక్షించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్‌చార్జ్ డి.ఆర్. శ్యాంసుందర్‌రావు పాల్గొన్నారు.
Miniature Unearthed
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.