AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bapatla: శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాలు.. ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఏపీలోని బాపట్ల జిల్లా ఓలేరు గ్రామంలో 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ విశ్వేశ్వరాలయం పునర్నిర్మాణ పనుల సందర్భంగా 15 పురాతన రాతి విగ్రహాలు వెలుగుచూశాయి. వీటిలో 12 అళ్వారుల విగ్రహాలతో పాటు లక్ష్మీదేవి, నరసింహస్వామి, విష్వక్సేనుని విగ్రహాలు ఉండటం ఆసక్తికరంగా మారింది.

Bapatla: శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాలు.. ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Temple Renovation
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 11:19 AM

Share

ఏపీలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని శ్రీ విశ్వేశ్వరాలయంలో పునర్నిర్మాణ పనుల సందర్భంగా పురాతన రాతి విగ్రహాలు వెలుగుచూడడం ఆసక్తికరంగా మారింది. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవదాయ శాఖ ఆలయంలో పునర్నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ప్రొక్లైనర్‌తో తవ్వకాలు చేపట్టగా, కొద్దిపాటి లోతులోనే భారీ రాళ్లు తగిలినట్లు శబ్దాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు యంత్రంతో తవ్వకాలను నిలిపివేసి, అత్యంత జాగ్రత్తగా చేతితో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా రాతి విగ్రహాలు బయటపడటంతో అక్కడ మరిన్ని విగ్రహాలు ఉండొచ్చన్న భావనతో తవ్వకాలను కొనసాగించారు. చివరికి మొత్తం 15 పురాతన రాతి విగ్రహాలు వెలుగుచూశాయి. వీటిలో 12 అళ్వారుల విగ్రహాలు, ఒక లక్ష్మీదేవి విగ్రహం, ఒక నరసింహస్వామి విగ్రహం, ఒక విష్వక్సేనుని విగ్రహం ఉన్నట్లు గుర్తించారు.

Ancient Idols

Ancient Idols

భూమిలో నుంచి విగ్రహాలను జాగ్రత్తగా వెలికితీసిన గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని ఆలయ ప్రాంగణంలో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో మల్లెల రమేశ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఓలేరు గ్రామానికి చెందిన దేవదాయ శాఖ మాజీ కమిషనర్ ముక్తేశ్వరరావు విగ్రహాలను పరిశీలించగా, అవి ఏ కాలానికి చెందినవో నిర్ధారించేందుకు పురావస్తు శాఖ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. అయితే శివాలయ ప్రాంగణంలో వైష్ణవ సంప్రదాయానికి చెందిన అళ్వారులు, లక్ష్మీదేవి, నరసింహస్వామి, విష్వక్సేనుని విగ్రహాలు వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ ప్రాంతంలో వైష్ణవ ఆలయం ఉండేదా? లేక ఏదైనా కారణంతో ఈ విగ్రహాలను భూమిలో భద్రపరిచారా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

పురాతన శిల్ప సంపద వెలుగుచూడటంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విగ్రహాలు ఏ కాలానికి చెందినవి? వాటిని ఎవరు ప్రతిష్ఠించారు? అనే అంశాలపై పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు ప్రారంభించారు. వారి నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us