అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. 5లక్షలు దాటిన మృతుల సంఖ్య.. క్యాండిల్ లైట్ చేపట్టిన బైడెన్
ప్రపంచంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అటు అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది.
America Corona : ప్రపంచంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అటు అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది. మహమ్మారి బారిన పడి సోమవారం ఐదు లక్షల మంది మృత్యువాతపడ్డారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 5,00,071 మంది ఈ రాకాసి కోరల్లో చిక్కుకుని ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ వెలుపల నిర్వహించిన క్యాండిల్ లైట్ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పాల్గొని నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. మొదటి, రెండో ప్రపంచయుద్దాలు, వియత్నాం యుద్దంలో కలిపి మరణించిన అమెరికన్ల సంఖ్య కంటే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు.
‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని బైడెన్ తెలిపారు. కలిసికట్టుగా ఈ కరోనా మహమ్మారితో పోరాడాలని అన్నారు. గతంలో తన భార్య, పిల్లలను ప్రమాదంలో కోల్పోయిన విషయాన్ని జో బైడెన్ గుర్తుచేశారు. దు:ఖం జీవితంలో ఓ మార్గాన్ని చూపుతుందని ఆయన అన్నారు.
కాగా.. అమెరికాలో మొట్టమొదటి కరోనా మరణం గతేడాది ఫిబ్రవరిలో నమోదైంది. ఆ తర్వాత మూడు నెలల సమయంలోనే మరణాల సంఖ్య లక్ష దాటింది. మరో నాలుగు నెలల్లో ఈ సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. ఆ తర్వాత మూడు నెలలకు మూడు లక్షలకు, బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి నాలుగు లక్షలకు, ఇప్పుడు ఐదు లక్షలకు చేరింది. మరోవైపు అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 2,81,86,824 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి అగ్రరాజ్యంలో కొత్త కలవరం మొదలైంది.