Joe Biden: అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన వారికి ప్రత్యేక స్థానం లభిస్తున్నాయి. ఇక తాజాగా బైడెన్ ప్రభుత్వం మరో భారతీయ అమెరికన్‌కు ఉన్నత పదవికి నామినేట్ చేసింది. అమెరికా అంతర్జాతీయ మత స్వచ్ఛకు సంబంధించిన అంబాసిడర్-ఎట్-లార్జ్ పదవికి రషద్ హుస్సేన్‌ను దేశ అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారని వైట్ హౌస్ ప్రకటించింది. అంబాసిడర్-ఎట్-లార్జ్ పదవిలో ఉన్న వారు అమెరికా తరఫున కేవలం ఒక దేశానికే రాయబారిగా ఉండబోరు. పలు దేశాలకు, వేర్వేరు బాధ్యతల్లో రాయబారిగా, అవసరమైతే మంత్రిగా వ్యవహరిస్తారు. ఐక్యరాజ్యసమితి, యురోపియన్ యూనియన్ (ఈయూ)ల్లో అమెరికా తరఫున అంతర్జాతీయ చర్చల్లో పాల్గొంటారు.
ఇంతటి ఉన్నత పదవికి అమెరికా ఒక ముస్లింను నామినేట్ చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుతం హుస్సేన్ అమెరికా జాతీయ భద్రతా మండలిలో పార్ట్‌నర్‌షిప్స్, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ పని చేశారు. . ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్ యూఎస్ అప్పీల్స్ డామన్ కీత్‌కు జ్యుడీషియల్ లా క్లర్క్‌గా పనిచేశాడు. ఒబామా-బిడెన్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కౌన్సెల్‌గా కూడా ఉన్నారు. హుస్సేన్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాలు చేసి మాస్టర్స్ డిగ్రీని పొందారు. అయితే జో బైడెన్ ప్రభుత్వం అన్ని మతాల వారి విశ్వాసాలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని వైట్ హౌస్ పేర్కొంది.