women for covid vaccine : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ రాకాసి కోరల నుంచి రక్షించేందుకు జనం నానాఅవస్థలు పడుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ విజృంభిస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది. కాగా, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం ఇద్దరు మహిళలు వృద్ధులుగా నాటకమాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఒర్లాండో నగరంలో చోటు చేసుకుంది. అందరి కళ్లుగప్పి వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నా.. రెండో డోస్ వేయించుకునే సమయంలో ఆ ఇద్దరు మహిళలు పోలీసులకు చిక్కారు.
అమెరికా వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వారియర్లు, 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు మొదట వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒర్లాండోకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమెతో పాటు 45 ఏళ్ల వయసున్న మరో మహిళ తోడైంది. ఇద్దరు కలిసి వారి పుట్టిన తేదీలను 65 ఏళ్లు మించేలా మార్చుకొని వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం నెత్తికి తలపాగా చుట్టుకొని, గ్లౌజ్‌లు, కళ్లద్దాలు పెట్టుకొని వృద్ధుల వేషధారణతో వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లారు.
అయితే, ఆ ఇద్దరు మహిళల పేర్లు వారి గుర్తింపు కార్డు.. రిజిస్ట్రేషన్ జాబితాలో ఒకేలా ఉన్నా.. పుట్టిన తేదీలు వేరుగా ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మహిళలిద్దరి అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి వ్యాక్సిన్ లేదా కరోనా పరీక్షల కోసం, ఇతర కారణాలతో కన్వెన్షన్ సెంటర్‌కు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘింస్తే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. విచారణలో వీరిద్దరు ఇదివరకే వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఎక్కడ.. ఎప్పుడు అనే వివరాలు వెల్లడికాలేదు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యాక్సినేషన్ జరుగుతుందా? అనే కోణంలో అమెరికా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.