అమెరికా-ఇరాన్ మధ్య మెల్లగా యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ దేశ గూఢచర్య డ్రోన్ ని ఇరాన్ కూల్చివేయడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిప్పులు కక్కారు. ఇలా చేసి ఇరాన్ పెద్ద పొరబాటు చేసిందన్నారు. వెంటనే ఆ దేశంపై సైనిక దాడులు చేయాలని తమ మిలటరీని ఆదేశించారు. అయితే కొద్ది గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో సైనికాధికారులు అర్ధాంతరంగా వెనక్కి తగ్గారు. మొదట ఇరాన్ మీద దాడికి అమెరికా యుధ్ధ విమానాలు, నౌకలు సన్నద్ధమయ్యాయి. టెహరాన్ లోని పలు కీలక స్థావరాలను టార్గెట్ గా పెట్టుకున్నాయి. మరికొన్ని క్షణాల్లో అమెరికన్ మిసైళ్లు వాటిపై గర్జించనుండగా.. వాటిని ట్రంప్ ఉపసంహరించినట్టు ఏబీసీ న్యూస్ తెలిపింది. ఇరాన్ పై దాడి యోచనను ట్రంప్ విరమించుకున్నారా లేక వ్యూహంలో మార్పు వల్ల డిలే జరిగిందా అన్న విషయం తేలలేదని పేర్కొంది. తమ దేశ గగనతలంపై ఎగురుతున్న అమెరికన్ డ్రోన్ ని ఇరాన్ గురువారం కూల్చివేసింది. అయితే అంతర్జాతీయ జలాల్లో తమ డ్రోన్ దిగాల్సి ఉందని, దాన్ని కూల్చివేయడం ద్వారా ఇరాన్ పెద్ద తప్పే చేసిందని ట్రంప్ అన్నారు. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో ఈ తాజా ఘటన మరింత ఆజ్యం పోసింది. యుఎస్ మిలిటరీ డ్రోన్ మా దేశ ప్రాదేశిక జలాలపై ఎగురుతున్న కారణంగానే దాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఏమైనా.. అమెరికా చర్యను తాము ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ తెలిపారు. తాము యుధ్ధాన్ని కోరుకోవడంలేదని, కానీ అమెరికా దూకుడుగా వ్యవహరిస్తే మా దేశ భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇలా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ-నివార్క్ ముంబైకి వెళ్లే విమానాలను రద్దు చేసింది. ఇరాన్ గగనతలం మీదుగా భారత్ కు వెళ్లే విమానాలను రద్దు చేసినట్టు యునైటెడ్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ముంబై నుంచి న్యూజెర్సీ లోని నివార్క్ విమానాశ్రయానికి రావాలనుకునే ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాలను ఎంచుకోవాలని సూచించింది.